Sunday, July 15, 2007

రావి మొక్క

ఈ రావి మొక్కను బాగా చిన్నగా ఉన్నపుడు తీసుకొచ్హాను. అది పెరుగుతూ ఉంటే రెండుసార్లు కుండీలను మార్చాను. మరో రెండుసార్లు పైభాగమంతా కత్తిరించేసాను. అదిమాత్రం వామనుడిలా విపరీతంగా పెరిగిపోతూనేఉంది. ఇక కుండీ పగలగొట్టి నేలపై నాలుగయిదు ఇటికలను లేపేసి కొంత మట్టి తవ్వి దీన్ని పాతేసాను. ఇక ఇపుడు ఇది నాతో పాటే పెరుగుతుంది పెద్దవుతుంది. ఇంకా మాపిల్లలతోపాటుగా పెరుగుతూ ఇంకా ఇంకా పేద్దదయిపోతుంది. దాంతో కోతికొమ్మచ్హి అడుకోవచ్హు, ఊయల కట్టి ఊగచ్హు, దాని క్రిందో మంచమేసి హాయిగా అడ్డంగా పడుకోవచ్హు, అపై పిట్టలు రెట్టలు వెయ్యచ్హు "



నాకు ఈపోష్టుకు వచ్హిన కామెంట్స్ దౄష్టిలో పెట్టుకొని మరొక్కసారి మోడరేట్ చేయాలనిపించింది. మారుటేరు అనే ఊరినుంచి గోదావరిని ఆనుకొని ఉన్న కోడేరు అనే ఊరివరకూ 50 అడుగుల వెడల్పు గల రోడ్డు 7 కిలో మీటర్లవరకూఉంటుంది. ఈరోడ్ లో విపరీతమైన ఎండ వేడి కాల్చేస్తున్నపుడు కూడా స్థానికులు సైకిళ్ళపై తిరుగుతునే ఉంటారు.కాని ఎవరి వంటిమీదకూడా ఒక్క ఎండ పొడ కూడా పడేదికాదు . కారణం ఆరోడ్డుకు రెండు వైపులా మర్రి, రావి, గుగ్గిళం, మరియు చింత లాంటి చెట్లు వరుసగా ప్రక్కప్రక్కగా ఈ 7 కిలోమీటర్లూ పరచుకునుంటాయి. నిజాయితీ కలిగిన అధికార్లు ఎవరో అప్పుడెప్పుడో పుణ్యం కట్టుకొని పనులు ఖచ్హితంగా చేయించి ఉంటారు. ప్రతి సంవత్సరం రోడ్డు మీదకొచ్హే కొమ్మలను కొట్టేస్తుంటారు అవి మళ్ళీ పెరుగుతూ పోతుంటాయి. రోడ్డు పొడుగూతా ఎంతదూరంచూసినా రెండువైపులా గోడలా అద్భుతంగా కనిపించేది.

ఇదంతా ఒకప్పటి మాట ---మరి ఇప్పుడు..? వరదల కారణంగా కొన్నిపోతే, బాగాపెరిగిన చెట్ల తొర్రలలో రాత్రి వేళల పెట్రొల్ పోసి మంట పెట్టి దుర్మార్గంగా చెట్లను చంపేసే వారి వలన మరికొన్ని. దాదాపు 90 శాతం వరకూ పోయాయి. బోడి రోడ్డు మాత్రం మిగిలిందిప్పుడు. అటు వెళ్ళినపుడల్లా నాకనిపించేది మళ్ళీ పూర్వపు మాదిరి ఎవరు నాటుతారు నాటినా ఎప్పటికి పెద్దవయ్యేను అని. దీంద్వారా నాకు తెలిసిందేమిటయ్యా అంటే పూల పండ్ల మొక్కలు వేస్తే వాటి ఆలనా పాలనా ఎప్పుడూ చూస్తూనే ఉండాలి. లేదా అవి చచ్హూరుకుంటాయి. కాని పైన చెప్పబడిన మొక్కలను ఎక్కడైనా వేసి మరచిపోయినా అవి పెరుగుతూ పోతాయ్. లేదా కొంత శ్రద్ధ చేసి వదిలేస్తే ఇంకా బాగా పెరుగుతాయ్. వీటి గురించి లాబాలు చెప్పక్కరలేదు మీకూ తెలుసు. నాకు అలాటి అవకాశం ఏది దొరికినా వదలను. ముందోసారి పంచాయతీలో ఇంటింటికీ రెండు మొక్కలు పంచుతుంటే వద్దనుకున్న వాళ్ళను బ్రతిమలాడి వాళ్ళను తీసుకెళ్ళి మరీ వాళ్ళమొక్కలను కూడా నేను తీసుకు తెచ్హుకున్నాను . తెచ్హినవన్నీ బ్రహ్మాండంగా పెరుగుతున్నాయి.మా పెద్దమ్మగారింటికెళ్ళినపుడు రెండు మూడు బాదంకాయలను ఒకప్రక్కగా పాతి వచ్హేసాను ఆ సంగతి మరచిపోయాను కూడా. కొంతకాలానికి నేవెళ్ళెసరికి అక్కడొక మీడియం బాదం చెట్టుంది నాకు మహానందం కలిగింది. ఇవన్నీ నాకే ఉపయోగపడతాయనీ కాదు. నాకే ఉపయోగపడాలనీకాదు. నే చేస్తూ పోతానంతే అతరువాతంతా సర్వ ప్రయోజనం........

6 comments:

Abhijit said...

ఎవరైనా పూల మొక్కలు పెంచుకుంటారు గానీ రావి మొక్క/చెట్టును పెంచుకుంటారా?

Anonymous said...

ఎవరైనా పూల మొక్కలు పెంచుకుంటారు గానీ రావి మొక్క/చెట్టును పెంచుకుంటారా?

రాధిక said...

రావి చెట్టు వేసిన చోట చుట్టుపక్కల ఏమి లేకుండా చూడాలి.దాని వేర్లు బలం గా వుండడం వల్ల అన్ని పోతాయి.ముక్యం గా ఇళ్ళల్లో అసలు పెంచకూడదండి.ఇళ్ళళ్ళో పగుళ్ళు వస్తాయి.[ఫొటో లో వెనుక గోడ కనపడింది అందుకే ఇలా చెప్పాను]

Viswanadh. BK said...

మీరు చెప్పినది కరెక్ట్. అయితే ఇది మా ఇంటి వద్ద గాని మాఊరిలోగాని కాదు గొడౌన్ లాటి షెడ్ ప్రక్కనుంది. ఇలాటి మొక్కలు అక్కడ ఉపయోగపడుతాయని అనుకుంటా. నేనెక్కడికి వెళ్ళినా దొరికిన మెక్కలను నేనున్నంతకాలం పెంచడం నాకలవాటు ఇది కూడా అలానేనండి .
అయినా మా ఇంటికి ప్రహరీ ఎక్కడుండండీ.

Unknown said...

మీ బ్లాగ్ చాల బాగుంది. మాది మీ ఉరు దగ్గర్లొ ఉన్న ఆచంట.
Veera swamy

spandana said...

చాలా మంచి పని చేస్తున్నారు.

--ప్రసాద్
http://blog.charasala.com