Wednesday, August 22, 2007

పాపికొండల్లో రెండవ పోష్ట్.

ఇంతకు ముందు పోష్టులో కొంతవరకూ రాసాను ఇది కొనసాగింపు. మా ప్రయాణ ప్రయాణ విశేషాలలో రాజమండ్రి నుండి ఆ సాయంత్రం టికెట్స్ తీసుకొని వెనక్కొచ్హిన మేము శనివారం రాత్రి రాజమండ్రి వెళ్ళాలని నిర్ణయించుకొన్నాము. ఆదివారం ఉదయం 5 గంటలకు రేవులో ఉండాలని చెప్పారు. ఉదయం 5 గంటలంటే ఎవడులేస్తాడు. అందుకనే ముందురోజన్నమాట. అనుకున్నట్లుగా శనివారం సాయంత్రం మూటా ముల్లే సర్దుకొని అందరం బయలుదేరాం. మెయిన్ రోడ్డుకు వచ్హి ఎంతసేపు ఎదురు చూసినా రాజమండ్రి బస్సు మాత్రం రాలేదు. 'చత్ మంచి టైంలో బయలుదేరలేదురా మనం' మావాళ్ళకామెంట్స్ మొదలైనయ్. మరి బస్సే కావాలంటె ఇలాగే ఉంటుంది.ఏదో ఓదాంట్లో పోయేదానికి మరికొందరు నసుగుతుండటంతో అప్పుడే వచ్హిన రాజమండ్రి క్వారీ లారీ ఆపి దబదబా పైకెక్కేసారంతా..రావులపాలెం కడియం మీదుగా వేమగిరి రూట్లో రాజమండ్రి రైల్వే స్టేషన్ దగ్గరగా వదిలేసిపోయాడు లారీవాడు. రోడ్డు మీద అంగుళానికో గొయ్యిఉండటం వలన లారీవాడు వచ్హిన స్పీడుకి మేము వెనుక ఎక్కడానికి సరిపోవడంతో ఎవడూ కొట్టకుండానే తన్నులు తిన్నవాళ్ళలా అయిపోయింది మా పరిస్థితి.అక్కడి నుండి పడుతూలేస్తూ ఆటోలకోసం వెతకటం మొదలెట్టారు. కాళీగా ఉన్న ఒక ఆటో వచ్హింది. అది అలా ఆగటం ఆలస్యం నేనంటే నేనని టపటపా ఎక్కేసారు. ఆరుగురెక్కవలసిన ఆటోలో పదిమంది ఎక్కేయడంతో ఆటోవాడు బిత్తరపోయి పోలీసులు పట్టుకుంటారు సార్ ఇంతమందెక్కేస్తే ఆన్నాడు. ఒరేయ్ నువ్వు దిగరా! అంటే కాదు నువ్వు దిగరా! అనుకొంటూ మొత్తానికి నలుగురు బయట పడ్డారు. వెంటనే ఇంకో రెండు ఆటోలు రావడంతో అందరం చకచకా ఎక్కేసాం. తిన్నగా మార్కండేయస్వామి గుడి దగ్గర దిగి అటుప్రక్కగా ఉన్న ఆర్యవైశ్య సత్రానికి వెళ్ళాం. ఒక రూము తీసుకొని బ్యాగులన్నీ ఒక మూల పడేసి స్నానాలు వగైరా పూర్తి చేసుకొని రోడ్లమీద పడ్డాం. కాసేపు అలాలా తిరిగి ముందే వివరాలు తెలియడంవలన మరుసటి రోజుకు ఏమేమికావాలో తీసేసుకోవాలనుకొన్నాం. బిస్చెట్ పాకెట్స్ , హౌసీగేం పాకెట్ మరియు పుస్తకం, చిప్స్ పాకెట్స్ , యాపిల్స్ , ఒక ప్లాస్టిచ్ చాప ఇలా చాలా ఐటెంలు తీసుకొన్నారు. అన్నీ కొనడం అయిపోయాక అక్కడ మంచి భోజనహొటల్ గురించి కొంత సమాచారం సేకరించి ఒక హొటెల్ కెళ్ళి భోజనం కానిచ్హి మెల్లగా తిరిగి రూముకు బయలుదేరాం. గదిలో ఒకేచాప ఉంది మేము ఒకటి కొని తెచ్హాం రెండిటితో ఇంతమంది ఎడ్జస్ట్ అవడం కష్టం కాబట్టి సత్రం వాళ్ళను బ్రతిమాలో మరెలాగో మరో రెండు చాపలు సంపాదించారు. తీసుకొచ్హిన చాపలు వేయటమే ఆలస్యం అన్నట్టుగా ఒరేయ్ నేనిక్కడరా,కొంచెం పక్కకి జరగరా, ఒరేయ్ నువ్విక్కడనుంచి పోరా,ఒరేయ్ నాక్కొంచెం చోటివ్వండిరా,నేనిక్కడ పడుకోనెహె పందిగాడు మీదకాళ్ళేస్తున్నాడు,ఏయ్ పక్కకు జరుగెహె,ఇలా అరుచుకొంటూ అడ్డదిడ్డంగా వాలిపోయారు ఉదయం 4 గంటలకు లేచి చకచకా కాలకౄత్యాలు ముగించి ఎవడి బ్యాగ్ వాడు భుజాన తగిలించి అందరూ తయారయిపోయారు. తయారవడం అయ్యారుగాని ఎవడూ కడలడం లేదు. పరిస్థితి ఏమిటంటే ! టీ గాని కాఫీ గాని పడితేతప్ప కదలనని మొరాయించే సాల్తీలు చాలాఉన్నాయి మా గ్రూపులో. బయటి పరిస్థితి చూస్తే చీకటి,చలి, ఇప్పుడెడు షాపులు తెరుచుకూర్చుంటాడు. సరే చూద్దాం లెమ్మని కొంతదూరం చూస్తూ పోయాం. టీ బడ్డీలైతే బొచ్హెడున్నాయిగానీ అన్నీ షర్టర్లు దించేసో బరకాల్తో మూసేసో ఉన్నాయ్ . మావాళ్ళు టీ పట్టు వదలని విక్రమార్కుల్లా ఒక గోనెలబరకం లోపల నిద్రపోతున్న టీబడ్డీ ఆసామిని బ్రతిమాలోబామాలో మొత్తమ్మీద లేపారు. పాపం అతను వీళ్ళ గోల పడలేక స్టవ్ వెలిగించి టీ కాచి ఇచ్హేంతవరకూ వదల్లేదు. తేనీటి సేవనం అయ్యాక సంత్రుప్తి పడి మావాళ్ళంతా హుషారుగా రేవు వైపుగా నడక సాగించారు. ఉదయం మేము వెళ్ళేసరికే రేవులో విపరీతంగా జనం వచ్హిఉన్నారు. అప్పటికే రెండు వెళ్ళి పోగా ఇంకా వరుసలో నాలుగున్నాయి. మేము టికెట్స్ ఇచ్హే దగ్గరకు వెళ్ళి మా టికెట్స్ చూపించి ఎందులో కూర్చోవాలో అడిగాము. మీఇష్టం నాలుగిట్లో ఎందులోనైనా ఎక్కచ్హు. అవన్నీ ఒకదాని వెనుక ఒకటి బయలుదేరేవే. అన్నాడు.ముందుగా ఉన్నది అప్పటికే సగంపైగా నిండిపోవడం వలన కాళీగా ఉన్న రెండవదాంట్లోకెళ్ళాం. అన్నిటికీ పైన కార్పెట్స్ వేసిఉన్నాయి కూర్చొనేందుకు వీలుగా. వెళ్ళిన మమ్మల్ని డైవర్ అడిగాడు. పైకెళతారా! లోనికెళతారా! అని. ముందుగా తెలిసిఉండటంవలన పైనే కూర్చుంటాం అని చెప్పాం. అప్పటికి టెంట్ వేయలేదు. కొంచెం ఎండ వచ్హాక వేస్తానన్నాడు.సరేనని చెప్పులు ప్రక్కన విడిచి కూర్చున్నాం అందరం.

అప్పుడప్పుడే కొంచెం కొంచెంగా వెలుగు వస్తూ ఉంది బాగా చలిగాకూడాఉంది. మరికొద్ది సమయంలొనే నావ పూర్తిగా నిండిపోయింది. రెండు పార్టులుగా ఉండే నావక్రింది బాగంలో ఒకవైపు మాత్రమే జనాన్ని ఎక్కించారు. రెండవవైపు రెండు పెద్దసైజు గ్యాస్ స్టవ్వులూ, ఒక గ్యాస్ బండ, మరికొన్ని పెద్దా చిన్నా పాత్రలు, భోజనం వండేందుకు కావలసిన కూరగాయలు బియ్యం లాంటి సంబారాలు మూటలుగా ప్రక్కగా ఉన్నాయి. అప్పటికే ఒక ఆడమనిషి మరొక కుర్రవాడు ఉల్లిపాయలను పెద్దపేద్ద అల్యూమినియం ప్లేట్లలోకి చకచకా కోసేస్తున్నారు. నావపై ఎక్కేందుకు వేసిన పెద్దబల్లలను తీసేసారు ఇంజన్ స్టార్టయ్యింది. నావ గుండ్రంగా వెనుక నుండి ముందుకు తిరిగి మెల్లగా బయలుదేరింది. వడ్డున ఇంకా ఉన్న జనం, ఎక్కించేందుకు వచ్హిన బంధువులు చేతులూపిస్తుంటే మేమూ వాళ్ళకు టాటా చెప్పాం చేతులూపుతూ. ఒక్కొక్క రేవునూదాటుకొంటూ నావ పాత బ్రిడ్జి క్రిందుగా ముందుకు సాగిపోయింది. ఆరోజు వాతావరణం కొంచెం మబ్బుగా ఉంది సూర్యోదయాన్ని చూసేందుకు లేకుండా పొగమంచుమాదిరిగా విస్తరించి ఉంది. గొప్పరోజు పెట్టార్రా బాబూ ఇంకే రోజూ దొరకనట్టుగా ఇప్పుడుగాని వర్షం కొట్టిందంటే చచ్హామన్నమాటే. నవ్వుతూ మావాళ్ళ కామెంట్స్. అయితే కాసేపట్లోనే ఉదయపు కిరణాల ధాటికి మంచూ మబ్బులూ ఎగిరిపోయాయ్. రాజమహేంద్రి వెనుకగా దినకరుడు మెల్లగా పైపైకి తొంగిచూస్తున్నాడు.


వాతావరణం ఆహ్లాదంగా ఉండి మావాళ్ళు ఉత్సాహాంగా మాటల్లో పడ్డారు. రాజమండ్రి వైపు ఒడ్డును అనుసరించి కొతదూరంవరకూ వెళ్ళి ఆపై గోదారి నడి మధ్యకు తిరిగింది. అంత ప్రొద్దున్నే కూడా అక్కడక్కడా పైపైకి తొంగి చూస్తున్న ఇసుక దిబ్బల మధ్య చిన్నచిన్న పడవల్లో వలలతో చేపలు పట్టుకొంటూ చాలా మంది కనిపిస్తున్నారు.

OUR GROUP





బహుశా ఉదయపు మార్కెట్టుకు వేయడానికనుకుంటా. వాళ్ళందరినీ దాటుకుంటూ కొవ్వూరు మీదుగా పట్టిసీమ వైపుగా సాగిపోయింది. నీళ్ళమధ్య ఉండుట వలననుకుంటా ఒకవైపునుండి మాదిరిగా ఎండ వస్తున్నా చలిగాలి వీస్తుంది. ఏడున్నర ఎనిమిది మధ్యలో అందరికీ పేపర్ ప్లేట్లలో టిఫిన్ ఇవ్వడం మొదలెట్టారు. అందరూ ఎగబడి తీసుకోడం మెదలెట్టారు. అవును పాపం అప్పటికే అందరికీ కడుపులో ఎలకలు పరుగెడుతున్నాయ్. ప్లేట్ లో మూడు మైసూర్ బోండా రెండుగరిటెల ఉప్మా తీసుకొచ్హి ఇచ్హాడొకతను అందులో కొబ్బరి చట్నీ లాంటిదేదో కూడా ఉంది. తినడం పూర్తయినతరువాత టీ తీసుకొచ్హారు వేగంగా వెళ్ళే నావ చుట్టూనీళ్ళు చల్లటి వాతావరణంలో అలా టీ తీసుకొనే మజానే మజా.


అల్పాహారం అయింతరువాత మరికొంత సేపట్లో మీడియం బ్రిడ్జి లాటి కొవ్వూరు గ్యాస్ పైప్ లైన్ కనిపించింది. సింగిల్ లైన్ వారది కట్టారు పెద్ద సైజ్ పైపులను గోదావరిమీదుగా కలుపుతూ వెళ్ళేందుకు.







దూరంగా మసకమసకగా పట్టీసీమ దేవాలయం కనుపిస్తున్నది. దగ్గరకు వెళ్ళే కొద్దీ మరింత అందంగా నీళ్ళలో ప్రతిఫలిస్తూ గోదావరి మధ్యలో చిన్న దీవి

దాన్ని చూస్తుంటే నా ఊహ తెలిసిన తరువాత వచ్హిన ప్రయాణం గుర్తొచ్హింది. అప్పటికి పట్టిసీమ బాగా అభివౄద్ది చెందలేదు. నిడదవోలు మీదుగా బస్సుపై వచ్హి ఇవతలి గట్టునుండి పడవలపై అటు వడ్డుకు వెళ్ళే వాళ్ళం లాంచీలు ఉండేవికావు. రోజుకు వచ్హే నలుగురైదుగురి కోసం లాంచి ఎవడు పెడాతాడు. పడవ దిగి వడ్డునుంచి దిబ్బ దగ్గరకు నదుచుకు వెళ్ళాక గుట్టపైకెళ్ళేందుకు మెట్లలాంటివేం ఉండేటివికావు రోజూ వచ్హే కొద్దిమందీ నడవగా ఏర్పడిన మట్టిదారిలోనే జాగ్రత్తగా ఎక్కవలసివచ్హేది. పైన చూస్తే కేవలం సున్నపురాయి ఇటుకలు కొండరాళ్ళతో కట్టబడిన దేవాలయాలు. సున్నపుకోటింగులు ఎక్కువై పెచ్హులుపెచ్హులుగా ఊడిపోతూనూ, కొన్నిచోట్ల ఇటుకలతో సహా సిమెంటు పెచ్హులుగా లేచిపోయిన గోడలు, దేవాలయాల లోపల కరెంటు లేక నల్లగా పొగచూరినట్టుగా ఉండేది. ఆదాయం లేని దేవాలయాల పరిస్థితి అలాగే ఉంటుందేమో. దేవాలయాల లోపలి పరిస్థితి బాగుండకపోయినా అక్కడి వాతావరణం చుట్టూ ప్రకౄతితో ప్రశాంతంగా భక్తి భావం పెంపొందించేలాఉండేది. వెనుక ఉన్న మండపంలో వంటరిగా కాసేపు కూర్చుంటే నిశ్శబ్దంగా ఉన్నపరిశరాలతో మనసుకు కొంచెందిగులుగా మరికొంచెం వైరాగ్యంగా అదోలా ఉంటుంది.


.అసలలాంటి ఫీలింగ్ రాని దేవాలయం దేవాలయంలానే అనిపించదు. క్యూలలో గుద్దుకొంటూ తోసుకొంటూ కేకలు గొడవ మధ్య ప్రశాంతంగా దేవుని ముందు నిల్చుని ఒక్క క్షణమైనా ధ్యానించగలమా. అటువంటి చోట్లకు వెళ్ళి ప్రయోజనమే లేదు ఏదో మనమూ వెళ్ళాం అనుకోవడంతప్ప. "

6 comments:

విహారి(KBL) said...

అదిరిందండి మీ ఆర్టికల్,ఫొటొలు.అచ్చం చూస్తున్నట్లు వుంది.ఇంత పెద్ద ఆర్టికల్ ఎలా రాసారండి బాబు.మేము డిగ్రీలో వుండగా టూర్ వెళ్లాం రాజమండ్రి,పట్టిసీమ,పోలవరం.కాని లాంచిలో కాదు.మినిబస్ లొ.పోలవరంలొ కూడా పట్టిసీమలొ వున్నట్లే గోదావరి మధ్యలొ గుడి వుంటుంది.జానకి రాముడు మూవీలొ ఆ గుడి కనిపిస్తుంది.

విశ్వనాధ్ said...

నిజానికి నేను బ్లాగ్ మొదలెట్టింది నా జ్ఞాపకాలు శాశ్వతంగా నిలిచిపోయే{ఫొటోలతొ సహా} మంచి పుస్తకం లాంటిది కాబట్టి. నాకు డైరీ రాసే అలవాటు లేదు జ్ఞాపకాలు కొంతకాలానికి ఎలానూ మాసిపోతాయి.ఇలా అయితే భవిష్యత్తులో సరదాగా చదువుకొని ఆనందించవచ్హు.పిల్లల పిల్లలకూ చదువుకొనే అవకాశం ఉంటుంది అని కొంచెం ఖ'స్టమయినా రాసేసుకొంటున్నాను.

విహారి(KBL) said...

అలా అంటారా. నేను సాధ్యమైనంతవరకు ఎక్కువ రాయాలనే అనుకుంటాను.కాని బద్దకం.నా దశ ఉత్తమ బ్లాగులు అర్టికల్ చూసారా.మీ అభిప్రాయం చెప్పగలరు.

మెహెర్ said...

చాలా బావుంది. ముఖ్యంగా మీరు ప్రెజెంట్ చేసిన విధానం. టికెట్ ఖర్చు లేకుండా మా గోదావరిని కళ్ళ ముందు నిలిపారు. థాంక్స్.

విహారి(KBL) said...

శ్రావణపూర్ణిమ(రాఖీ)శుభాకాంక్షలు.

విహారి(KBL) said...

మీకు క్రిష్ణాష్టమి శుభాకాంక్షలు.