Tuesday, March 3, 2015

శ్రీకాకుళం



శ్రీకాకుళం అతి పురాతన చరిత్ర కలిగిన పట్టణం. భారతదేశం యొక్క  ఈశాన్య ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక ప్రముక పట్టణం మరియు జిల్లా యొక్క ముఖ్యపట్టణం. ఉత్తరాంధ్రగానూ, గుల్షంబాద్ గానూ, చీకాకోల్ గానూ, శీఖాకోల్‌గా కూడా పిలుస్తూ శ్రీకాకుళం స్థిరపరచబడినది. 
 
చారిత్రక విశేషాలు
దీని చారిత్రక విశేషాలలోనికి వెళితే, క్రీస్తుకు పూర్వం 6వ శతాబ్ధంలో బౌద్ద మత ప్రాభల్యం ఎక్కువగా ఉండేది. 14 వ శతాబ్ధంలో భారతదేశ తూర్పు రాజవంశాలైన గంగారాజ వంశపు రాజుల యొక్క కళింగ రాజ్యంలో సుమారుగా 800 సంవత్సరాలు ఒక భాగంగా ఉండేది.  ఒరిస్సా గజపతులను, కొండ జమీలకు కూడా భాగంగా కలుపుకొని రాజ్యం వర్ధిల్లింది. విజయనగరం రాజులు కూడా కొంత కాలం శ్రీకాకుళంలో కొంత భాగాన్ని పరిపాలించారు. తరువాత ముస్లిం పరిపాలనలో కొంత కాలం ఉంది. వారు గుల్షన్‌బాద్‌గా వ్యవహరించేవారు. తరువాత కొంత కాలానికి బ్రిటిష్ రాజరికంలో దీనిని చీకాకోల్‌గా వ్యవహరించారు. స్వతంత్రానంతరం శ్రీకాకుళంగా మార్చారు. 
శాలిహుండం, జగతి మెట్ట, ధంతపురి మొదలైన ప్రదేశాలలో జరిగిన అనేక తవ్వకాల ఆధారంగా ఇక్కడి ప్రజలు గొప్ప శాంతితో కూడిన సాంస్కృతిక జీవితం అనుభవించిన ఆనవాళ్ళు లభించాయి.
నదులు
బలరాముని నాగలి ధాటికి విచ్చిల్లిన భూమి నుండి ఉద్భవించిన నాగావళీ నది మొదలు వంశధార, మహేంద్రతనయ, చంపావతి, భుధ, సువర్ణముఖి, వేగవతి మరియు గోముఖి నదుల వలన పచ్చని పంటలతో, అరణ్యాలతో విలసిల్లిన భూమి శ్రీకాకుళం.
క్షేత్రాలు
పురాణపరంగా, పుణ్యక్షేత్రాలపరంగా వాసికెక్కిన మేటి శ్రీకాకుళం పట్టణం. పురాణాలలో తెల్పబడిన ఎన్నో క్షేత్రాలు, తీర్ధాలు ఈ ప్రాంతంలో కనిపిస్తాయి. అరసవెల్లి, శ్రీకూర్మం, ముఖలింగం లాంటి ప్రసిద్ద క్షేత్రాలతో విలసిల్లుతుంది.

ప్రముఖులు
ఇక్కడ వడ్డాది పాపయ్య, ఎస్. కాంతారావు, కరణం మల్లేశ్వరి,కాళీపట్నం రామారావు, కోడి రామ్మూర్తి నాయుడు,గిడుగు రామమూర్తి, బలివాడ కాంతారావు, మల్లాది వేంకట కృష్ణశర్మ, సర్దార్ గౌతు లచ్చన్న వంటి పెక్కుమంది కళాకారులు, సాహితీకారులు, రాజకీయనాయకులు ఇలా ఎన్నో రంగాలలో విశేషమైన కృషి చేసారు

శ్రీకాకుళం పట్టణానికి రవాణా బహుముఖాలుగా ఉంది. మద్రాస్,కలకత్తా జాతీయ రహదారి 5 ను ఆనుకొని ఉండటం, శ్రీకాకుళం పట్టణానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో శ్రీకాకుళం రోడ్డు రైల్వే లైను ద్వారా రవాణా వసతి కలిగిఉంది.

No comments: