Friday, March 6, 2015

శ్రీ ఉమా రుద్రకోటేశ్వర స్వామి దేవస్థానం, శ్రీకాకుళం


ఉమారుద్రకోటేశ్వరస్వామి దేవస్థానం పంచాయతన దేవాలయాల్లో ఒకటి. దేవాలయాన్ని ఆనుకొని నాగవళి నది పరవళ్ళు తొక్కుతూ ఉంటుంది. 'శ్రీ'లకు ఆకారమైన పట్టణంగా శ్రీకాకుళంను పూర్వం రుద్రకోటేశ్వర అగ్రహారం అనెడివారు. బలరాముడు ద్వాపర యుగాంతమున ప్రతిష్టించిన ఐదు ఆలయాల్లో ఒకటి కనుక పంచలింగ క్షేత్రమని పిలిచేవారు. బౌద్ద ప్రాభల్యం ఎక్కువగా కల ఈ ప్రాంతం క్రీ.శ. 4 వ శతాబ్ధం నుండి  వైదిక మత ప్రాభల్యం పెరిగి శైవమతం వ్యాప్తి జరిగింది. 

ఉమా రుద్ర కోటేశ్వర స్వామి క్షేత్ర చరిత్ర
కురుక్షేత్ర సంగ్రామంలో బంధునాశానన్ని చూడలేక బలరాముడు తీర్ధ యాత్రలకు దక్షణానికి బయలుదేరతాడు. వింద్యపర్వతములు దాటి దండకారణ్యం అధిగమించి మాధవ వనములో పధ్మనాభ పర్వత ప్రాంతములో నివసించుచూఉండెను. కరువు కాటకములతో బాధపడుతున్న కళింగ ప్రజలు కొందరు బలరాముని దర్శించవచ్చి తమకు కరువునుండి విముక్తి కల్పించమని వేడుకొన్నారు. దానితో బలరాముడు వారికి జలాధారము కల్పిస్తే పాడిపంటలతో ఆ ప్రాంతము సస్యశ్యామలమవునని తలచి వారితో మీరు కాశీ క్షేత్రమునకు వెళ్ళకుండా ఇక్కడికే గంగా జలమును తెప్పిస్తాను అని తన నాగలితో భూమిని చీల్చుచూ జలమును పైకి తెచ్చెను. అలా నాగలి వలన ఏర్పడినది కనుక దానిని నాగావళి నదిగా పిలిచారు. ఆ జలవాహిని సంగం దగ్గర నుండి వేగవతి, సువర్ణముఖీ నదులను కలుపుకుంటూ చాలా దూరం ప్రయాణం చేసి సాగర సంగమం చేసినది.
 ఈ నాగావళి వడ్డున పంచ లింగాలను బలరాముడు ప్రతిష్టించెను - అవి
* ఒరిస్సాలో రాయఘడ వద్ద పాయకపాడులో పాయకేశ్వర స్వామివారు
* పార్వతీపురంకు మూడు కిలోమీటర్ల దూరంలో గుంప గ్రామంలో సంగమేశ్వరస్వామి
* పాలకొండ దరి సంగం వద్ద సంగమేశ్వరుడు
* శ్రీకాకుళంలో ఉమారుద్రకోటేశ్వరుడు
* కళ్ళేపల్లి గ్రామం వద్ద మణి నాగేశ్వర స్వామి

నిర్మాణ విశేషాలు
ఈ ఆలయంలో ప్రాచీన వైఖరి కొట్టొచ్చినట్టుగా కంపిస్తుంది. పూర్వదేవాలయం మహమ్మదీయ దండయాత్రలకు నాశనం అవ్వగా 1774 లో కోనాడ వస్తవ్యులు శ్రీ మగటపల్లి కామయ్య శెట్టి గారిచే పునర్నిర్మాణం జరిగినది. మూల విగ్రహాన్ని 2003లో అష్టభంధన సహిత శిలాకవచంతో సద్గురు కృష్ణయాజి గారి ఆధ్వర్యంలో పునప్రతిష్టించారు. ఈ ఆలయం శిల్ప సౌందర్యంతో శాస్త్రీయ మెళకువలతో నిర్మించారు. ఆలయ మద్యస్తంగా పెద్ద ఏకశిలా నందీశ్వరుడు, ద్వారానికిరువైపులా బృంగీశ్వర,శృంగీశ్వరులు దర్శనమిస్తారు. మరోవైపుగా ఆలయ సముదాయంలో శ్రీరాముడు సీతమ్మ వారితో ఏకశిలపై దర్శనమిస్తారు. ఇంకొకవైపు రుక్మిణీ సత్యభామా సమేత వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. దేవాలయ వెలుపలి వైపుగా పెను వటవృక్షం ఉంది. దీని పాదప్రాంతంలో వరసిద్ది వినాయక స్వామి పూజలందుకొంటుంటాడు.

No comments: